బూర్గంపహాడ్, ఏప్రిల్ 01 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ విషయంలో గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్కు ఫిర్యాదు నేపథ్యంలో బుధవారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాన్ని అదనపు కలెక్టర్ విద్యాచందన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. సెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు చేసే ప్రదేశం వద్ద అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను వివరించారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం సెల్ టవర్ నిర్మాణం ఉంటుందని, రేడియేషన్ ప్రభావం కూడా ఉండదని చెబుతున్నారని అయితే మండల అధికారుల బృందంచే గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు. ఆమె వెంట ఏపీడీ రమణ, ఎంపీడీఓ జమలారెడ్డి, ఆడిట్ సెల్ అధికారి సునీల్ శర్మ, సర్పంచ్ బానోత్ సరోజ, కార్యదర్శి స్పందన ఉన్నారు.