ఇల్లెందు, ఏప్రిల్ 03 : రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాగురి పాలన నశించాలని కోరుతూ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ, మండల యువజన నాయకులు గురువారం వినూత్న రీతిలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల అడవిపై ప్రభుత్వ ఊచకోతను నిరసిస్తూ, విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు వారు కండ్లకు గంతలు కట్టుకుని ఇల్లందు కొత్త బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగ నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీలు అంటే లెక్కలేదు, కోర్టుల మాట వినరు, ప్రొఫెసర్లు అంటే గౌరవం లేదు, పర్యావరణం మీద ప్రేమ లేదు ఈ మొండి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసిందల్లా ఒక్కటే విద్య, బుల్డోజర్ భాష…లాఠీ యాస.. ఇది కాంగ్రెస్ సర్కార్ తీరు అని మండిపడ్డారు. హెచ్సీయూలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు జరుగుతుంటే, తమ జీవితాలను పణంగా పెట్టి విద్యార్థులు పోరాడుతుంటే తెలంగాణ మేధావులు, ఉన్నత విద్యావంతులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మొన్నటికి మొన్న హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసి నిరాశ్రయలు చేసింది. లగచర్లలో రైతులపై పోలీసులు దమనకాండ జరిపారు. నేడు పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జీలు ఇవన్ని చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పోలీస్ పరిపాలన చేస్తుందని దుయ్యబట్టారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం హరితహారం పేరుతో సుభిక్షంగా ఉంటే, నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో హరిత సంహారం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా హెచ్సీయూలో దమనకాండను ఆపకపోతే భవిష్యత్లో ఉవ్వెత్తున ఎగసిపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ, మండల యువజన & విద్యార్థి విభాగం నాయకులు గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, భూక్య సురేశ్, కొండు రవికాంత్, నీలం రాజశేఖర్, లలిత్ కుమార్ పాసి, ఎస్కే. చాంద్ పాషా, నెమలి నిఖిల్, ఎస్కే. ఇమ్రాన్, వాంకుడోత్ బిపిన్ నాయక్, మలగుండ్ల ఉపేందర్, తోటకూర శ్రీకాంత్, శనిగరపు శ్రీరామ్, గండమల్ల రామకృష్ణ, ఎండి. ఇంతియాజ్, ఈర్ల శ్రీకాంత్, వార రమేశ్, అజ్మీర రాజశేఖర్, ధనరాజ్, మీరజ్ బేగ్ పాల్గొన్నారు.
BRS&BRSV : కాంగ్రెస్ గుండాగురి నశించాలని ఇల్లందులో వినూత్న నిరసన