చండ్రుగొండ, ఏప్రిల్ 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహ్మద్‌నగర్ గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో మంగళవారం గ్రామంలో సర్వేకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ దత్తత గ్రామం మహమ్మద్‌నగర్‌లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడంపై అధికారులను నిలదీశారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే ఇండ్లు వచ్చినట్లు ఆరోపించారు. ఇప్పటికే ఇండ్లు ఉండి, ఆస్తులున్న వారికే మళ్లీ ఇండ్లు కేటాయించారని, గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు ఇండ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు వచ్చేవరకు గ్రామంలోకి అధికారులను రానీయమని మహిళలు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే దత్తత గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల రగడపై అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.