జూలూరుపాడు, ఏప్రిల్ 10 : నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్రకుమార్ తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాటినుంచి ధరలు అమాంతం పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు గ్యాస్ ధరలు 225 శాతం పెంచి మహిళలను మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లే విధంగా చేస్తున్నాడని విమర్శించారు.
సామాన్య ప్రజానీకం నడ్డి విరిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, గ్యాస్‌పై ఒకేసారి రూ.50 పెంచి సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, నాయకులు యల్లంకి మధు, వలమల్ల సామేలు, ఎస్కే చాంద్ పాషా, నిమ్మటూరి లచ్చయ్య, పత్తిపాటి మహేశ్, షేక్ బుడెన్ పాషా, శివ, గార్లపాటి రమణయ్య, చీమకుర్తి సంతోశ్, నరేశ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.