పాల్వంచ, మార్చి 20 : ఇల్లందు క్రాస్ రోడ్డులో జాటోత్ ఠాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అలాగే ఇల్లందు క్రాస్ రోడ్డు బదులుగా జాటోత్ ఠాను జంక్షన్‌గా నామకరణం చేయాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షుడు (లంబాడా గిరిజన సంఘ నాయకులు) రమేశ్ రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాల్వంచ పట్టణ పరిధిలోనీ మైనింగ్ కాలేజీ ఎదురుగా జాటోత్ ఠాను నాయక్ వర్ధంతి నిర్వహించారు, ఈ సందర్బంగా ఠానునాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గిరిజన ఉద్యమ నాయకుడు జాటోతు ఠాను నాయక్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించిన యుద్ధ వీరుడు అని రమేశ్ రాథోడ్ అన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం విసునూరు దేశ్‌ముఖ్ గుండాలను, నిజాం రజాకార్లను ఎదురించిన ధైర్యశాలి ఠాను నాయక్ అని కొనియాడారు. ధర్మాపూర్ తండా పోరు గడ్డను దాస్య శృంఖలాల నుండి విముక్తి చేసి అమరుడైన బంజారా కొదమ సింహం ఠాను నాయక్ అన్నారు. కావునా గిరిజన జనాభా ఎక్కువ ఉన్న ఈ ప్రాంతం ఇల్లందు క్రాస్ ను ఠాను నాయక్ జంక్షన్ గా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధర్మాసోత్ ఉపేందర్, నాయకులు అనిల్ ఇస్లావత్, రామకృష్ణ మాలోత్, చందు, అర్జున్ పాల్గొన్నారు.