– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 13 : అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట వందలాది మందితో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీడబ్ల్యూఓ స్వర్ణలత లేనిన కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలు కట్టు బానిసలు కాదని, చాలీచాలని వేతనాలు ఇస్తూ అధిక పని భారంతో వెట్టి చాకిరీ చేయించుకోవాలనే ప్రభుత్వ వైఖరిని ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం పాలకులకు తగదని మండిపడ్డారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార పంపిణీ, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీల శ్రమను గుర్తించకుండా వారిపై సంబంధం లేని అదనపు విధులను మోపడం దారుణమన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా పనిభారం పెంచడం శ్రమ దోపిడీయేనని ధ్వజమెత్తారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యూసఫ్ డిమాండ్ చేశారు. రూ.18 వేల గౌరవ వేతన హామీని అమలు చేయడంతో పాటు పని భారాన్ని తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అంగన్వాడీల ఆగ్రహాన్ని ప్రభుత్వం తక్కువగా అంచనా వేయొద్దని, వారి పోరాటానికి ఏఐటీయూసీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా సమరభేరి మోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు, నరాటి ప్రసాద్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతా మహాలక్ష్మి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఈశ్వరి, కరుణకుమారి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి అరుణ, గోనె మణి తో పాటు మువ్వా లక్ష్మీ కుమారి, కంచర్ల జమలయ్య, వేల్పుల మల్లికార్జున్, రాజు, షాహిన్, ధనలక్ష్మి, కైసర్, పద్మ, లక్ష్మి, ప్రమీల, రాణి, సరోజ పాల్గొన్నారు.