రామవరం, ఆగస్టు 13 : కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయం, వారి సంక్షేమం కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామని చెప్పే సింగరేణి యాజమాన్యం కార్మికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించలేక పోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ ఇండ్లలో ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్ గాని, ఇతర వాటర్ ఫిల్టర్ లను గాని వాడరు కార్మికులు. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం తమకోసం స్వచ్ఛమైన నీటిని ఇస్తుందని వారికి ఉన్న నమ్మకం. కానీ ఆ నమ్మకం సన్నగిల్లుతుంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ నుండి కార్మిక ప్రాంతాలైన రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్ ప్రాంతాల్లో నివాసముండే కార్మికులు, అధికారుల ఇళ్లకు నీటిని సరఫరా చేస్తుంటారు. ఇటీవల నీటిని టీడీఎస్ పరికరం ద్వారా పరిశీలిస్తే 973 పి.పి.ఎం (“పార్ట్స్ పర్ మిలియన్”) చూపించింది. ఈ స్థాయిలో పి.పి.ఎం చూపెట్టడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా 50-150 పి.పి.ఎం ఉన్న నీరు తాగేందుకు అనువైనదిగా పరిగణించబడుతుంది. 150-250 పీపీఎం ఆమోదయోగ్యమైనది. కానీ నీరు కొద్దిగా గుర్తించదగిన రుచిని కలిగి ఉండవచ్చు. కానీ సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ నుండి సరఫరా చేస్తున్న నీటిలో అధిక స్థాయిలో పి.పి.ఎం ఉండడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయమై ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్.రామకృష్ణను వివరణ అడగగా తాము నిర్వహించాల్సిన పరీక్షలన్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాగునీటిలో పీపీఎం పెరగడానికి గల కారణాలను పరిశీలిస్తామని, రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించి సాధ్యమైనా తొందరలో సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.