– కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి
రుద్రంపూర్, మే 23 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా “నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” కార్యక్రమాన్ని శనివారం కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను వినియోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డా. టి. భరత్ మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను రైతులు సాగు చేయాలని, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న డబ్ల్యూ జి ఎల్-44 (సిద్ది), కెఎన్ఎం-1638 వరి విత్తనాలను సాగు చేసి రైతులు అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు.
ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. ప్రతి రైతు ఇంటి వద్దనే ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. రైతులు ఒకే రకమైన పంటలపై ఆధారపడకుండా ఆయిల్ పామ్, మునగ, తీగజాతి కూరగాయలు వంటి ఉద్యాన పంటలను సాగు చేయడం ద్వారా పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయం పొందడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈసం ప్రవళిక మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది రైతులు పాల్గొన్నారు.