రామవరం, జూలై 31 : సింగరేణిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలను తక్షణమే అమలు చేయాలని ఏబీకేఎంఎస్ కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుడు పి.మాధవ నాయక్ డిమాండ్ చేశారు. గురువారం రుద్రంపూర్ సిఎస్పిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సింగరావు పిట్ సెక్రెటరీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, స్టాండర్డైజేషన్ కమిటీ సభ్యుడు టీఎస్.పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పి.మాధవ నాయక్ మాట్లాడుతూ.. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ యూనియన్లో నూతనంగా చేరిన రాజేశ్, గుమ్మడి కృష్ణమూర్తికి హార్దిక స్వాగతం పలికారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో అన్స్కిల్డ్ కార్మికుడికి రూ.1,285, సెమీస్కిల్డ్కు రూ.1,317, స్కిల్డ్ కార్మికుడికి రూ.1,383 చొప్పున రోజువారీ వేతనాలు చెల్లిస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం రూ.480 మాత్రమే చెల్లించడమన్నది తీవ్రమైన శ్రమ దోపిడీని సూచిస్తోందని విమర్శించారు.
గత 12 ఏళ్లుగా కనీస వేతనాల చట్టానికి సవరణ జరగక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. ఇది 1975 నాటికి పరిశ్రమల జాతీయీకరణకు ముందు జరిగిన శ్రమదోపిడీని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు సంస్థ ఉత్పత్తి, లాభాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున, వార్షిక బోనస్, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు, వార్షిక సెలవులు, గ్రాట్యూటీ, ఇతర సామాజిక భద్రతల విధానాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లకు మరమ్మతులు చేసి, అవి ఔట్ సోర్సింగ్ కార్మికులకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొగిలిపాక రవి, ఉట్ల గణేశ్, సంగం చంద్ర, రాజమౌళి, అలీ ప్రకాశ్, శ్యామ్లాల్, ఇనపనూరి నాగేశ్వరరావు, రాకేశ్, సింగారి శ్రీనివాస్, వీరవసంత్, కొండేటి నరసయ్య పాల్గొన్నారు.