ఇల్లెందు, మార్చి 31 : కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని పీడీఎస్యూ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు. సోమవారం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో పీడీఎస్యూ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుతోందని, తక్షణమే హెచ్సీయూ భూముల వేలాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో విద్యార్థులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కు లేకుండా గొంతు నొక్కుతున్నారని దుయ్యబట్టారు.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న పీడీఎస్యూ హెచ్సీయూ అధ్యక్షుడు నాగరాజును, స్టూడెంట్ యూనియన్ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించడం హేయమైనా చర్య అని, ఈ ఘటనను పీడీఎస్యూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీయూ భూముల కబ్జాను వెంటనే ఆపాలని లేనిపక్షంలో తీవ్ర నిరసనలు ఎదొర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఇల్లందు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.సాయి, ఏ.పార్థసారథి, గంగాధర గణేశ్, ముఖేశ్ పాల్గొన్నారు.