రుద్రంపూర్, మే 04 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ చేపట్టిన RP&NCRAP (రెమెడియేషన్ ప్లాన్ & సహజ సామాజిక వనరుల వృద్ధి ప్రణాళిక) కార్యక్రమం కింద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్ ఖని కోల్ మైన్ పర్యావరణ అనుమతుల సమయంలో మొక్కల నాటకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అయితే అనుమతులు వచ్చిన అనంతరం నాటిన మొక్కల పరిరక్షణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జీకే ఓసీకి వెళ్లే వ్యాలీ రోడ్డుపై నాటిన మొక్కలు ఎక్కువగా ఎండిపోవడం గమనార్హం. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా సింగరేణి సంస్థ మొక్కల సంరక్షణకు కాంట్రాక్టర్ల ద్వారా చెట్టు చుట్టూ కంచె ఏర్పాటు చేసి, అవి పెరిగే వరకు పర్యవేక్షణ చేయించే విధానం అమలు చేస్తుంది. కానీ ప్రస్తుతం ఆ పద్ధతి సరిగా అమలవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మొక్కలకు నీటి సరఫరా, సంరక్షణ చర్యలు చేపడితే వాటిలో కొంతైనా మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై మాటలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కచ్చితమైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, నాటిన మొక్కలను కాపాడడం కూడా అంతే ముఖ్యమని కార్మికులు సూచిస్తున్నారు.