భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 05 : కాంగ్రెస్ సర్కార్ పై విద్యార్థులు సమరభేరి మోగించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్ యర్డు నుండి గణేష్ టెంపుల్ వరకు విద్యార్థులు. నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏ ఒక్కరినీ వదలకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం చేసిందన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయని, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇవ్వకపోగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు తెలిపారు.
ఈనెల 10వ తేదీన ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఆందోళనకు సిద్ధమయ్యాయని, ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు వహిస్తుందన్నారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఇప్పటికే 97 జిఓ తెర పైకి తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యను శక్తి సంస్థకు అప్పగించాలని చూస్తుందన్నారు. పాలిటెక్నిక్ విద్యను శక్తికి అప్పగిస్తే బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్. భీమా శ్రీధర్. బండారి రుక్కు, బాదవత్ శాంతి, సోనా, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, పద్మ, మంజుల రాధ, నవతన్, శివ పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ విద్యను శక్తికి అప్పగిస్తే బీఆర్ఎస్ ఉద్యమం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర