జూలూరుపాడు, ఏప్రిల్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామంలో ఆడ మగ మొక్కజొన్న పంట వేసి కంకులు తిని చనిపోయిన జర్పుల కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్‌లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం డిమాండ్ చేశారు. బుధవారం వినోబానగర్ గ్రామంలో కృష్ణ కుటుంబాన్ని మాస్‌లైన్ జిల్లా ప్రతినిధి బృందం పరామర్శించింది. అనంతరం ముద్దా భిక్షం మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు చెందిన విత్తనాలు గ్రామాల్లోకి వచ్చి రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను కృష్ణ సాగు చేసి చేను వద్ద కాపలా కాస్తున్న సమయంలో కంకులు తినడంతో మృతి చెందాడన్నారు. తినే పంట కూడా విషంగా మారి నేడు రైతులను బలి తీసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ మృతితో ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో ఉన్నదని ఇద్దరు చిన్నపిల్లలు, భార్య, తల్లి, నాయనమ్మ దిక్కులేని వారు అయినట్లు తెలిపారు.
కృష్ణ మృతిపై వ్యవసాయ, రెవెన్యూ శాఖలు తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన కంపెనీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కృష్ణ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న విత్తనాలను రైతులకు ఇచ్చే సందర్భంలో కార్పొరేట్ కంపెనీలు కనీసం రసీదులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇటువంటి కంపెనీలను తక్షణమే నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణ మృతికి కారణమైన సదరు మొక్కజొన్న విత్తనాల కంపెనీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జాటోత్ కృష్ణ, అమర్లపూడి రాము, జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు బానోత్ ధర్మ, డివిజన్ నాయకుడు పెద్దబోయిన సతీశ్, మండల నాయకులు లింగాల వీరభద్రం, తోటకూరి నరేశ్, ఇరప రాజు, రైతులు అనిల్, గుగులోతు కృష్ణ, గోపా ఈశ్వర్, హరిసింగ్ పాల్గొన్నారు.