బోనకల్లు, సెప్టెంబర్ 13 : అకాల వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హేమంతరావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. సాధారణంగా ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం ఒకటి లేదా రెండు క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. వర్షాల వల్ల పత్తి చెట్లు ఏపుగా పెరిగినా, కాయలు కుళ్లిపోవడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని, వారు ముందుగానే కౌలు చెల్లించి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారన్నారు. అకాల వర్షాలతో కౌలు రైతులు అత్యధికంగా నష్టపోయారు, చాలా మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం కూడా రైతులకు నష్టాన్ని కలిగిస్తోందని, తెలంగాణలో 18 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు వెల్లడించారు. మొత్తం రైతులు అప్పులపాలై తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జక్కుల రామారావు, సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, రైతులు పుచ్చకాయల తిరుపయ్య, గోళ్ల కన్నయ్య, చింతలచెర్వు మాదారయ్య, కౌలు రైతులు పాల్గొన్నారు.