చుంచుపల్లి, ఆగస్టు 25 : విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. చుంచుపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులను ఏకం చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె. షాహిద్, నాయకులు మాణిక్యాల వినయ్, కొరిమి సంజయ్, మర్మం ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.