ఇల్లందు, ఏప్రిల్ 16 : ఇల్లందు పట్టణంలో జీఓ నంబర్ 76 కింద ఇండ్ల క్రమబద్ధీకరణ జీఓను పునరుద్ధరించాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం డిప్యూటీ తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టీయూసీఐ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఇల్లందు పట్టణ కార్యదర్శి పాయం వెంకన్న మాట్లాడుతూ.. సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు గానీ, రిజిస్ట్రేషన్ లేని పరిస్థితి నుండి గత ప్రభుత్వం జీఓ నంబర్ 76 ద్వారా ఇండ్ల యజమానులు ఆన్లైన్ చేసుకుని కొంతమంది పట్టాలు పొందారు. ఇంకా చాలామంది డిడీలు కట్టి ఉన్నారు. వారికి పట్టాలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
జిల్లా అధికారులు, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని 76 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెవెన్యూ ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు ఎస్డీ రంజాన్, వేముల గురునాథం, కొత్తపల్లి రఘు, టి.యూ.సి.ఐ ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.