ఇల్లెందు, డిసెంబర్ 1 : నవంబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.00 లక్షల టన్నులకు గాను 2.17 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 43 శాతం ఉత్పత్తి చేశామని జీఎం వి.కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 0.18 లక్షల టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా, 0.85 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.24, ఇల్లందు ఏరియాలో మొత్తం 2.27 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేశామన్నారు.
నవంబర్ నెలలో ఐదు ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా చేసామని తెలిపారు. అదేవిధంగా ఇల్లందు ఏరియాకు కేటాయించిన వార్షిక బొగ్గు లక్ష్యం 28.83 లక్షల టన్నులకు గాను 12.29 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 57 % సాధించామన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వైజర్స్, యూనియన్ నాయకులు, ఉద్యోగులను జీం కృష్ణయ అభినందించారు.