రుద్రంపూర్, ఏప్రిల్ 25 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంపూర్లో ఉన్న సబ్ స్టేషన్ పాముల ఆవాస కేంద్రంగా మారిందని అక్కడి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుండి తరచూ విష సర్పాలు బయటకు వస్తుండటంతో ఉద్యోగులు భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు తీసుకువచ్చిన టిఫిన్ బాక్సుల్లో కూడా పాములు కనిపించిన ఘటనలు ఉన్నట్లు వారు తెలిపారు. ఎప్పుడు, ఎటు నుండి పాము వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సబ్ స్టేషన్లోని మిషనరీ విభాగాల్లో కూడా పాములు ఆవాసాలు ఏర్పరుచుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల రక్షణ వారోత్సవాలు నిర్వహించినప్పటికీ, ఇక్కడ కార్మికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోలేదని కార్మికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్ స్టేషన్ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలా చేస్తే చిత్తడి వాతావరణం తగ్గి పాముల సంచారం కూడా తగ్గే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.