బూర్గంపహాడ్, సెప్టెంబరు 08 : ద్విచక్రవాహనంపై తరలిస్తున్న గంజాయి, ఇద్దరు నిందితులను బూర్గంపహాడ్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం సాయంత్రం బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఎస్ఐ నాగభిక్షం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ వాహన తనిఖీల్లో టీవీఎస్ వాహనంపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వెంట తెచ్చుకున్న రెండు బ్యాగుల్లో 18.6 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వారిని విచారించగా కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాకు చెందిన నవీన్‌కుమార్, విజయ్‌కుమార్ బయల్దేరి ఒడిశా రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా గంజాయిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుల నుండి గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.9.33 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.