దమ్మపేట, జూలై 16 : బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు రైతుల సమస్యలపై నిరసనకు సిద్ధమైన అశ్వారావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి స్టేషన్కు తరలించగా, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును దమ్మపేట తాటిసుబ్బన్నగూడెంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రుల దండు మణుగూరు వస్తుంటే, రైతుల సమస్యలపై ప్రశ్నిస్తారనే వణుకు ఎందుకు పట్టుకుందని, అధికారంలోకి రాకముందు ఆకాశం నుంచి అమృతం తెస్తామన్న కాంగ్రెస్ నాయకులు, తీరా గద్దెనెక్కాక రైతుల కష్టాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. ఓట్లు వేసిన పాపానికి ప్రజలకు మీరు ఇస్తున్న బహుమతి జైలు శిక్షలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నారు.
కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్యాంగంపై కంటే లాఠీలపైనే నమ్మకం ఎక్కువైనట్లుందని, పోలీసులను అడ్డుపెట్టుకుని పాలించడానికి తాను ముఖ్యమంత్రా? లేక నియంతనా అని మెచ్చా ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం తప్పైతే.. ఆ తప్పును బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుందని కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కొచ్చు అనుకోవడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వంమన్నారు. వారి చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఈ దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని అరెస్టులు చేసిన ప్రజల పక్షాన తాము నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని రాబోయే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చాక ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కావునా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.