జూలూరుపాడు, మే 23 : మండుతున్న ఎండల తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఒకరు బలయ్యారు. వడదెబ్బ(Sun Stroke) బారిన పడి ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. కరివారిగూడెం గ్రామానికి చెందిన ధరావత్ నరసింహారావు (45) గత మూడు రోజుల క్రితం తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. వైద్య చికిత్స అందించినా ఆరోగ్యం విషమించి మరణించాడు.
ధరావత్ నరసింహారావు కొంతకాలంగా మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ నిమిత్తం ఆయన ప్రతిరోజు సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లేవాడు. అయితే.. మూడు రోజుల క్రితం తీవ్రమైన ఎండల కారణంగా నరసింహారావు వడదెబ్బకు గురయ్యాడు. జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు.
కానీ, శనివారం ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో నరసింహారావు తుదిశ్వాస విడిచాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కైన నరసింహారావు అకాల మరణంతో కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నరసింహారావు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.