రుద్రంపూర్, మే 25 : చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఆదివారం వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఎన్.రజనీకాంత్‌కు రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ సోమవారం నివాళులర్పించారు. అనంతరం దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు కేస్లీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే బాధిత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రజనీకాంత్ కుటుంబానికి పంచాయతీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంకటి సత్తి, రాజేశ్, పాటి సుధాకర్ మోహన్, నారాయణ, బాలు, మల్లేశ్వరి, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.