– వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి
చుంచుపల్లి, మార్చి 18 : కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రైతు సదస్సు- కిసాన్ మేళా అనే కార్యక్రమాన్ని బుధవారం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేవీకే అందిస్తున్న సేవలను సద్వినియోగం పరుచుకుని రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని తద్వారా అభివృద్ధి పథంలో నడవాలని సూచించారు. అలాగే రైతులు మట్టి పరీక్ష చేయించుకుని ప్రధాన గుణంగా ఎరువులు వాడాలని చెప్పారు.
అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. మన ప్రాంతానికి అనుకూలంగా పంటలను పండించుకోవాలన్నారు. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యల యాజమన్య పద్ధతుల గురించి వివరించారు. త్రీ ఇంక్లైన్ గ్రామ సర్పంచ్ ప్రవళిక మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ.. రైతులకు శాస్త్రవేత్తల సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా స్థాయి వెటర్నరీ అధికారి, ఫిషరీ అధికారి ఆ శాఖ అందిస్తున్న పథకాలను రైతులకు వివరించారు. కొత్తగూడెం టాక్స్ చైర్మన్ మండే హనుమంతరావు అభ్యుదయ రైతులు, వారి అభిప్రాయాలను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ నాగాంజలి, శిరీష, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ పాల్గొన్నారు.

‘కృషి విజ్ఞాన కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి’