బూర్గంపహాడ్, మే 16 : అన్నదాతలు మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి వరి రకాలను ఎంపిక చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావుతో కలిసి రైతులకు విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేసిన నాణ్యమైన రకాలను దృష్టిలో ఉంచుకుని ప్రయోగాలు, కేంద్రం అందిస్తున్న సాంకేతిక సహకారం ద్వారా వరి, కంది విభాగాల్లో సమగ్ర విత్తనోత్పత్తి చేపడుతున్న వివరాలను వివరించారు. రైతులకు ఎరువుల అదనపు వాడకం భూసారం తగ్గడానికి కారణమవుతుందన్నారు.
పోటీతత్వ భావంతో మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగం నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సూచించారు. పచ్చి రొట్ట పైర్లు (జీలుగు, జనుము, పిల్లిపెసర, పెసర, మినము) సాగుతో పంట పరివర్తన చేస్తూ నేలను సుస్థిరంగా ఉంచేందుకు పచ్చిరొట్ట పైర్లను వాడుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ మాట్లాడుతూ రైతులు ఒకే రకమైన పంటలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఆ పంటలకు వచ్చిన ఇబ్బందులు పూర్తి ఆదాయాన్ని తగ్గిస్తాయని, పంట మార్పిడి వల్ల ఒక నిర్దిష్ట సందర్భంలో పంట వైఫల్యం వచ్చినా ఇతర పంటల వల్ల ఆదాయం సమతుల్యం చేసుకోవచ్చని ఆ సమయంలో మట్టి ఆరోగ్యాన్ని రక్షించవచ్చన్నారు. ఈ అవగాహన సదస్సులో సొసైటీ సీఈఓ ప్రసాద్, పాలకవర్గ సభ్యులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.