చుంచుపల్లి, ఏప్రిల్ 30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లితండాలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాలు వస్తే తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మండలంలోని పెనగడప, అంబేద్కర్‌నగర్, రాంపురంలో వర్షం కురువడంతో రైతులు భీతిల్లారు. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. అయినా అక్కడక్కడ ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోళ్లు ఎప్పటికప్పుడు చేపట్టి కాంట పెట్టి బస్తాల్లో నింపి మిల్లులకు తరలిస్తే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వర్షాలకు తేమ శాతం పెరిగే అవకాశం ఉందనీ, సహకార సంఘం వారు అరకొరగా పట్టాలు ఇవ్వడంతో రైతులే పట్టాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. తేమ శాతం చూసే మిషన్లు సైతం సరిగ్గా పనిచేయడం లేదని, రోజుకో విధంగా చూపెడుతున్నట్లు తెలిపారు. సొసైటీ అధికారులు చొరవ చూపి ధాన్యం కొనుగోళ్లు సాధ్యమైనంత తొందరగా చేపట్టాలని కోరారు.