– చివరి గింజ కొనుగోలు చేయకపోతే జంగ్ సైరన్
– బీఆర్ఎస్ సారపాక పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు
బూర్గంపహాడ్, జూన్ 20 : దేశానికి వెన్నెముకగా ఎదిగిన తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ దారుణంగా వెన్నుపోటు పొడిచిందని, అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో అన్నదాతలను అనాథగా మార్చే దుర్మార్గానికి తెగబడిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు సారపాక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సారపాకలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోకి రాగానే అధికార అహంతో తెలంగాణ ప్రజలు, రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆగం చేసిందని మండిపడ్డారు. పదేళ్లపాటు పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధును రూ.15 వేలకు పెంచుతామని, అన్ని పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసి రూ.500 బోనస్ చెల్లిస్తామని అబద్దపు హామీలిచ్చారని విమర్శించారు. ఇప్పటివరకు రైతులను ఏ మాత్రం ఆదుకోకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తూ రైతుల కంట కన్నీరు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఉరి వేయడానికి రైతు డిస్కంలను తెరపైకి తెచ్చారని రైతు బీమాకు కనీసం ప్రీమియం కూడా చెల్లించకుండా 7600 మంది కుటుంబాలకు మొండిచెయ్యి చూపారన్నారు. పదేళ్లపాటు యూరియా కొరతను సృష్టించి రైతులను వేధించారని, ఇన్ని కష్టాలు పడి పండించిన పంటను 60 రోజుల పాటు కొనకుండా వేధించడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
ప్రభుత్వ అసమర్ధత వల్ల ఇప్పటికే 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని.. 70 లక్షల మంది రైతులు, 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సోము లక్ష్మీచైతన్యరెడ్డి, పాలకవర్గ సభ్యులు తిరుపతి ఏసోబు, నియోజకవర్గ యూత్ నాయకులు చల్లకోటి పూర్ణ, మాజీ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ బానోతు శ్రీను, బీఆర్ఎస్ నాయకులు కర్రి నాగేశ్వరరావు, పంగి సురేష్, సూదిపాక ఈశ్వర్, చట్టు ఆంజనేయులు, దాసరి మోహనరావు, బెజ్జంకి కనకాచారి పాల్గొన్నారు.