జూలూరుపాడు, మే 15 : నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు తాసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ముట్టడితో ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది. అనంతరం తాసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా కాలయాపన చేస్తూ నామినేటెడ్ ద్వారా పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని చూడడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.
రైతుల భాగస్వామ్యంతో, వారి షేర్ క్యాపిటల్‌తో నడుస్తున్న సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం చేసుకుని, రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టాలని చూడడం సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల పైన ఉన్న పంట రుణాలను కూడా మాఫీ చేసి రైతులను ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, రబీ పంటకు సంబంధించిన రైతు భరోసా నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని కోరారు. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, యాస రోశయ్య, యలంకి మధు, సిరిపురపు వెంకటేశ్వర్లు, తూము కోటయ్య, పొన్నగంటి వెంకటేశ్వర్లు, చిమట ముత్తయ్య, ముత్తిలింగం, ఊడల సుధాకర్ పాల్గొన్నారు.

సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని రైతు సంఘం ధర్నా