కొత్తగూడెం, జూలై 16 : ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో ప్రిన్సిపాల్ జి.రమేష్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కొత్తగూడెం సహకారంతో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది, స్థానిక ప్రజల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేత్ర వైద్య నిపుణులు రవిచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 100 మంది విద్యార్థులు, సిబ్బందికి కంటి పరీక్షలు చేశారు. దృష్టి లోపం, కంటి ఇన్ఫెక్షన్లు, వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. తీవ్రమైన సమస్యలు ఉన్నవారికి తదుపరి చికిత్స కోసం రిఫరల్ కూడా అందించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి.రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కంటి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. సమాజ సేవలో భాగంగా భవిష్యత్లో కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ధోతి బాబురావు, రుషికుమార్, ఉషారాణి, పగడాల నగేష్, మండల రాజేశ్వరరావు, సక్రు, జే.బీ.మోహన్, పితాని సత్యనారాయణ, బొక్క శ్రీనివాస్, విజయలక్ష్మి, బిట్టి గోవర్ధన్, శ్రీనివాస్, రాజయ్య పాల్గొన్నారు.