బూర్గంపహాడ్, మే 28 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ 2006-07 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్ధులు తమ స్నేహితురాలికి ఆపన్నహస్తం అందించారు. చింతచిగురు కోసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి నడుం విరిగి మంచాన పడిన తమ స్నేహితురాలికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఆంధ్రాలోని కుక్కునూరుకు చెందిన ఆవుల నాగమణి 2022లో జరిగిన ప్రమాదంలో చెట్టుపై నుండి కిందపడి నడుం విరిగి మంచాన పడింది. దీంతో ఆమె కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతోంది. ఇటీవల తన స్నేహితులు పాల్వంచలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద 50 మందితో గెట్ టు గెదర్ నిర్వహించారు.
ఆ సమయంలో తోటి స్నేహితులు ఎస్ఎస్సీ హెల్పింగ్ నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు తాళ్ల రాజశ్రీరెడ్డి సహకారంతో పల్లంటి రమేష్, ఇనుమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తోటి మిత్రుల నుండి రూ.32,500 నగదు సేకరించారు. ఆ మొత్తం నగదుతో పాటు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు తీసుకుని కుక్కునూరులో ఉన్న నాగమణి నివాసానికి వెళ్లి అందజేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా స్నేహితురాలి కుటుంబానికి తామంతా అండగా ఉంటామని, ఎప్పుడు ఏ కష్టమొచ్చినా స్నేహితులుగా తామున్నామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటి స్నేహితులు ఇలేక, మల్లేశ్వరి, రాధ, లక్ష్మి, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.