రుద్రంపూర్, మే 15 : సింగరేణి సంస్థ భవిష్యత్ అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ ప్రణాళికలు, సవాళ్లపై వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ పలు విభాగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, భద్రత, యంత్రాల వినియోగంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. 2026-27 సంవత్సరానికి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, దీనిని సాధించేందుకు అన్ని ఏరియాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
భూగర్భ గనుల్లో ఆధునిక యంత్రాల వినియోగాన్ని మరింత పెంచుతున్నామని, ఉపరితల గనుల్లో భారీ యంత్రాల వినియోగంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పనితీరు మెరుగుపడటంతో పాటు కార్మికుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బొగ్గు నాణ్యత, మార్కెటింగ్ రంగాల్లో పోటీ మరియు పర్యావరణ పరిమితులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొనే దిశగా సంస్థ ముందుకు సాగుతోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన బొగ్గు సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.కంపెనీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యయ నియంత్రణతో పాటు ఆదాయ వనరులను పెంచే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్లో గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులు, ఆధునిక మైనింగ్ టెక్నాలజీపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. సింగరేణిలో మహిళా ఉద్యోగుల పాత్ర రోజురోజుకు పెరుగుతోందని, వారికి సురక్షితమైన పని వాతావరణం, ప్రత్యేక సంక్షేమ చర్యలు, శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమమే సంస్థ అభివృద్ధికి బలమని పేర్కొంటూ వైద్య సేవలు, విద్య, గృహ వసతి, తాగునీరు, క్రీడలు, ఉద్యోగుల పిల్లలకు విద్యా సహాయం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలంటే ప్రతి ఉద్యోగి సమయపాలన, హాజరు, భద్రతా నిబంధనల పాటిస్తూ, ఉత్పాదకత పెంపుపై దృష్టి పెట్టాలని జీఎం సూచించారు. సంస్థ అభివృద్ధి చెందితేనే ఉద్యోగుల భవిష్యత్ మరింత భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ (MDT) ద్వారా కొత్తగూడెం ఏరియాలోని గనులు, విభాగాల్లో ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థ పనితీరు, భవిష్యత్ లక్ష్యాలు, సవాళ్లు, సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగులకు వివరించనున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో జిఎంతో పాటు, (ఎస్.ఓ.టు జిఎం) కోటిరెడ్డి, ఏజీఎం (సివిల్) రామకృష్ణ , డిజిఎం (ఐఈడి) యోహన్, ఏజిఎం ( ఫైనాన్స్ ) బీబత్స, పీవీకే ఏజెంట్ రామ్ భరోస్ మెహతో, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ముక్కపాటి వెంకటేశ్వర్లు, డిజిఎం (ఈ&ఏం) ఏరియా వర్క్ షాప్ క్రిస్టోఫర్, పర్సనల్ మేనేజర్ తిరుపతి (ఆర్.సి.హె.చ్.పి) ఇన్చార్జి ఆజ్మీరా శ్రీనివాస్, ఇతర విభాగాల అదికారులు పాల్గొన్నారు.