రామవరం, జూన్ 17 : రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం మైనారిటీ గురుకులాల కార్యదర్శి పి.షఫీవుల్లాను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో సుమారు 10,000 మంది విద్యార్ధులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ పూర్తి చేసి బయటికి వస్తున్నారని, మైనారిటీలకు గురుకుల డిగ్రీ కళాశాలలు లేనందున అనేక మంది విద్యార్థులు గత ఐదేళ్లుగా ఇంటర్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 79 గురుకుల డిగ్రీ కళాశాలలున్నాయని, మైనారిటీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదన్నారు. ఈ కారణంగా గురుకులాల్లో ఇంటర్ వరకు చదివిన విద్యార్థులు ఉన్నత విధ్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున బాల, బాలికల కోసం వేర్వేరుగా ఉమ్మడి జిల్లాల్లో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన గురుకులాల కార్యదర్శి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎండి.ఫారూఖ్, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.