– ప్రహరీ కూల్చి మరి కబ్జా
టేకులపల్లి, జూన్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల భూమి ఆక్రమణకు గురవుతుండంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని రాంపురం పంచాయతీ హరిజన చెర్రి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల భూమిని కొందరు తమదేనని క్రమంగా ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాంపురం పంచాయతీ హరిజన చెర్రి ప్రాథమిక పాఠశాల దశాబ్దాలుగా విద్యా సేవలు అందిస్తూ వస్తోందని, కానీ కొందరు భూమి ప్రహారీ కూల్చివేసి కొద్దికొద్దిగా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం భూమిని ఆక్రమించి దున్నేశారని, అడ్డుచెప్తే పాఠశాల భూమి కుడా తమదేనని అంటున్నారని తెలిపారు.
విషయం తెలుసుకున్న ఎంఈఓ జగన్ మంగళవారం స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పాఠశాల పక్కన ఉన్న భూమి యజమానులను పిలిపించి ఆదివారం గ్రామస్తులు, భూ యాజమానులను పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఎప్పటి నుండో ఉన్న పాఠశాల భూమిని రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాంపురం పంచాయతీ సర్పంచ్ శివకృష్ణ, మాజీ ఎంపిటిసి భూక్య సరోజినీ, పాఠశాల హెచ్ఎం లక్ష్మణ్ పాల్గొన్నారు.

హరిజన చెర్రి ప్రభుత్వ పాఠశాల భూమి ఆక్రమణ