జూలూరుపాడు, మే 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని కప్పలకుంట చెరువు వద్ద బుధవారం ఉపాధిహామీ కూలీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా, కేవలం ఫొటోలు దిగి వెళ్లే వారి పేర్లు మాత్రమే మస్టర్లలో నమోదవుతున్నాయని, ఎండనక వాననక కష్టపడి పనులు చేసే నిజమైన కూలీల పేర్లు మస్టర్లలో రావడం లేదంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా తమకు వేతనాలు అందడం లేదని, పైగా జూలూరుపాడు పంచాయతీ పరిధిలోని పనుల్లో ఇతర పంచాయతీలకు చెందిన వారికి అవకాశం కల్పించడం ఏంటని కూలీలు అధికారులను నిలదీశారు. ఉపాధి పనులు చేసే ప్రతి ఒక్కరి పేరు మస్టర్లో నమోదయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.
ధర్నా జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఉపాధి హామీ ఈసీ సైదులుపై కూలీలు మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న ఎంపీడీఓ తాళ్లూరి రవి తక్షణమే స్పందించారు. ఉపాధి పనులకు వచ్చిన కూలీలందరికీ ఖచ్చితంగా పే-స్లిప్పులు పంపిణీ చేయాలని క్షేత్రస్థాయి ఉపాధి సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓ హామీతో సంతృప్తి చెందిన కూలీలు తమ ఆందోళనను విరమించి అక్కడి నుంచి వెనుదిరిగారు.