– జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి
జూలూరుపాడు, ఏప్రిల్ 06 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో మేట్ల పాత్ర అత్యంత కీలకమని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే కూలీలకు సరైన న్యాయం జరుగుతుందని జూలూరుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి అన్నారు. మండల పరిధిలోని 50 మంది కూలీలకు ఒకరు చొప్పున ఎంపిక చేసిన మేట్లకు సోమవారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలను చైతన్యపరిచి, వారికి పని కల్పించడంలో మేట్లు ముందుండాలని సూచించారు. అనంతరం ఏపీఓ రామారావు మేట్లకు విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. పని ప్రదేశంలో కూలీల హాజరును ఎన్.ఎమ్.ఎమ్.ఎస్ మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా నమోదు చేయాలి, ఫోటోలను ఎలా అప్లోడ్ చేయాలి అనే అంశంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
పని ప్రదేశంలో పనుల కొలతలు తీసుకోవడం, మస్టర్ రోల్స్‌ను పక్కాగా నిర్వహించడం, గరిష్ట వేతనం వచ్చేలా కూలీలకు పని విభజన చేయడంపై శిక్షణ ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు సహాయకారిగా ఉంటూ, పని ప్రదేశంలో కూలీలకు అవసరమైన తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించేలా వారిని చైతన్యపరిచి ఫీల్డ్ కు తీసుకురావాల్సిన బాధ్యత మేట్లపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, మండల వ్యాప్తంగా ఉన్న మేట్లు పాల్గొన్నారు.

‘ఉపాధి హామీ పథకం మేట్లతోనే విజయం’