కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంతా కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతిని పురుస్కరించుకుని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధీరత్వానికి, పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా హక్కులను, కార్మిక చట్టాలను కాలరాస్తోందన్నారు. ప్రజలకు శ్రేయస్కర పాలనను అందించాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై పెత్తనం చేస్తూ ప్రజా ఆస్తులను లూఠీ చేస్తూ బడా కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు.
ఇలాంటి పాలకులపై ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మతాలు, కూలాల పేరుతో చిచ్చురేపుతున్న కాషాయ వాదులను అంతా ఏకమై గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, జిల్లా సమితి సభ్యులు భూక్య శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, సిపిఐ నాయకులు ధర్మరాజు, రామకృష్ణ, ఎస్కే జలీల్, సోమయ్య, చింతల్ రాజు, బీసీ సంఘం నాయకులు అజితు, జంగంపల్లి రాజు, నాగేలి మల్లయ్య, మోహన్ ప్రసాద్, మురళి, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి ఎస్కే షాహిన్ పాల్గొన్నారు.