జూలూరుపాడు, జూన్ 06 : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం కింద జూలూరుపాడు మండలంలోని గ్రామ పంచాయతీల్లో శనివారం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలకు జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ప్రజలకు వివరించారు. కాకర్ల గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీరాజ్ & గ్రామీణ ఉపాధి శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ సీఈఓ అప్పారావు, డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్, ఎంపీడీఓ తాళ్లూరి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను ప్రజల ముందుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామస్థుల బాధ్యతలు, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ సీఈఓ నాగలక్ష్మి వీడియో ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించగా, అనంతరం ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. డిప్యూటీ కమిషనర్ విద్యాలత మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ వ్యవస్థలో శాఖల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు మండల స్థాయి అధికారులు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి : జడ్పీ సీఈఓ నాగలక్ష్మి