జూలూరుపాడు, ఆగస్టు 13 : ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా అలాగే భారత్ అమెరికా 50 శాతం సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు గుండెపిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రంప్ తో చెలిమి కొనసాగిస్తున్న మోదీ దేశాన్ని ట్రంప్ కాళ్ల కింద పెట్టి 140 కోట్ల భారత ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నట్లు దుయ్యబట్టారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన మోదీ వాటిని రద్దు చేయలేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులకు మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి 50 కోట్ల భారత కార్మిక వర్గాన్ని దెబ్బతీసిందన్నారు. ఈ కార్యక్రమoలో సీపీఎం మండల కార్యదర్శి యాస నరేశ్, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి బానోత్ ధర్మ, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి వల్లోజి రమేశ్, వామపక్ష నాయకులు ఎల్లంకి మధు, యాస రోశయ్య, గార్లపాటి వెంకటి, రాయల సిద్దు, ఎస్కే చాంద్ పాషా, గార్లపాటి వీరభద్రం, బోడ అభిమిత్ర, అనుమల అశోక్, పత్తిపాటి మహేశ్, చెరుకుమల్ల రాజేశ్వరరావు, పసుపులేటి పవన్, బొల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.