– రెండు రోజులుగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బందులు
రుద్రంపూర్, జూలై 02 : రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుండి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు తాగునీటి కోసం ఆస్పత్రి వెలుపలికి వెళ్లి బాటిళ్లలో నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కనీస అవసరమైన తాగునీటి ఏర్పాట్లు లేకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే చాలామంది నిరుపేదలే. వారికి నీటిని కొనుక్కొని తాగడం వారిపైన ఆర్థిక భారం పడుతుందంటున్నారు సహాయకులు. ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఆస్పత్రిలో నీటి సమస్య తలెత్తడం పరిపాటిగా మారిందని, శాశ్వత పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రిని సందర్శించిన సందర్భాల్లో కూడా సమస్యను వివరించినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. కనీస ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడం లేదని రాత్రిపూట నీళ్లు అవసరమైతే రామవరం వరకు నడుచుకుంటూ వెళ్లవలసి వస్తుందని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సహాయకులుగా వచ్చినటువంటి వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రిలో నవ భారత్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌కు స్థానిక బోరు నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో శుద్ధి యంత్రాలు తరచూ దెబ్బతింటున్నాయని సిబ్బంది తెలిపారు. దీంతో గతంలో సింగరేణి కాలనీలకు సరఫరా చేసే నీటిని ఆస్పత్రికి అందించేలా అప్పటి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు సహకారంతో ప్రత్యేక పైప్‌లైన్, నీటి ట్యాంకు ఏర్పాటు చేశారు.
అయితే ఇటీవల ఆ పైప్‌లైన్‌కు అక్రమంగా నీటి కనెక్షన్లు ఇవ్వడం వల్ల ఆస్పత్రికి రావాల్సిన నీరు తగ్గిపోయిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. గతంలో సింగరేణి సెక్యూరిటీ విభాగం నీటి చోరీకి పాల్పడిన వారిని హెచ్చరించినప్పటికీ, మళ్లీ అక్రమ కనెక్షన్లు పెరగడంతో సమస్య తీవ్రరూపం దాల్చిందని తెలిపారు. నీటి చోరీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్పత్రిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్యూరిఫైయర్ ప్లాంట్ కోసం ప్రత్యేక సంపును ఏర్పాటు చేసి, సింగరేణి నీటితో పాటు మిషన్ భగీరథ నీటిని కూడా అనుసంధానం చేయాలని స్థానికులు సూచిస్తున్నారు. అలాగే మరుగుదొడ్లలో విరిగిపోయిన కుళాయిల కారణంగా నీరు వృథా అవుతోందని, వాటిని వెంటనే మార్చి నీటి వృథాను నివారిస్తే ఆస్పత్రిలో 24 గంటలూ నీటి సరఫరా కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి తాత్కాలికంగా తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.