– 75 గజాల చొప్పున 807 మంది నిరుపేదలకు స్థలాలిచ్చిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం
– రూ.5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్ వాగ్ధానం
– ఇప్పుడు అరకొరగా లబ్ధిదారుల ఎంపిక
– మిగతా లబ్ధిదారుల్లో ఆందోళన
కొత్తగూడెం అర్బన్, మే 17 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో స్థలం లేని అత్యంత నిరుపేదలను గుర్తించి పక్కాగా సర్వే చేసి స్థలమిచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. ప్రతీ వార్డులో అర్హులైన వారికి పాత కొత్తగూడెంలో ప్రతీ ఒక్కరికీ 75 గజాల చొప్పున 807 మందిని లబ్దిదారులుగా గుర్తించి స్థల హక్కు పత్రాలనిచ్చారు. దానికి ”భగత్ సింగ్ నగర్” అని పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ప్రభుత్వం స్థలం ఉన్నవారికి రూ. 5 లక్షలను కేటాయించి పేదవాడు తల ఎత్తుకొని, ఆత్మగౌరవంతో బతికేలా జబర్ధస్త్ ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ వాగ్ధానం చేసింది. లబ్దిదారులంతా నిజమే అనుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలను నియమించింది.
ప్రభుత్వాధికారులు సర్వే చేయగా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా పాల్గొని తమ వంతు పాత్ర పోషించారు. సర్వేకు వచ్చిన వారికి గత ప్రభుత్వం ఇచ్చిన స్థల హక్కు పత్రాలను సైతం చూపించారు. ఇక ఇళ్లు మంజూరవుతుందని ఆశపడ్డారు. మరి జాబితాలో పేరుంటుందో… ఉండదో అని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీకి మంజూరైన ఇండ్లలో వార్డుకు సుమారు 10 నుంచి 15 ఇండ్లు మంజూరైనట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో ఆ సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇందులో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తమకు కావాల్సిన వారికి మంజూరు చేస్తే పాత కొత్తగూడెం భగత్ సింగ్ నగర్లో స్థలం ఉన్న వారి పరిస్థితేంటో అర్ధంకాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇందిరమ్మ కమిటీలపై ఇప్పటికే ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొంతమంది అధికార పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్లే వార్డుల్లో ఇంకా పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారికి, అనుచరులకే ఇళ్లు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. పాత కొత్తగూడెంలో స్థలం ఉన్న లబ్ధిదారులందరూ అనేకమార్లు ఉన్నతాధికారును కలిసినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం, హామీ లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత కొత్తగూడెంలో స్థల లబ్ధిదారుల కల ఇప్పట్లో నెరవేరేనా? ఇళ్ళు కట్టుకుని ఇంటి అద్దె బాధల నుంచి విముక్తి పొందవచ్చని అనుకుంటున్న స్థల యజమానుల కల కలగానే మిగిలిపోనుందా. మొత్తం 807 మంది ఉండగా పట్టణానికి మంజూరైనవి సుమారు 600 ఇండ్లే. ఈ లబ్దిదారుల్లో ఎంతమంది ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసే జాబితాలో ఉంటారో తెలియదు. అందులో అధికార పార్టీకి చెందినవారు, సానుభూతిపరులు, అనుచరులు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది. మొత్తంగా భగత్ సింగ్ నగర్ స్థల యజమానులు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఏ మేరకు కృషి చేస్తుందో, చర్యలు చేపడుతుందో చూడాలి మరి.
ప్రభుత్వం స్థలమిచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు కట్టుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు వచ్చి సర్వే చేశారు. మరి ఇళ్లు కట్టుకునే లిస్టులో నా పేరు ఉంటదో, లేదో తెలియడం లేదు. ప్రభుత్వమే స్థలమిచ్చింది కదా. అలాగే అందరికీ ఇళ్లు కట్టి ఇస్తే బాగుంటది.
ప్రభుత్వమే సర్వే చేసి అత్యంత నిరుపేదలైన వారిని గుర్తించి పాత కొత్తగూడెంలో 807 మందికి స్థలాలు ఇచ్చింది. వారందరికీ రూ.5 లక్షలను ఇందిరమ్మ పథకంలో మంజూరు చేసి ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలి. నిరుపేదలని ప్రభుత్వమే గుర్తించాక, ఇప్పుడు ఇళ్లు కట్టించేందుకు అభ్యంతరం ఏంటీ? ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. దశలవారీగా ఇళ్లు కట్టిస్తామంటే లబ్ధిదారుల్లో ఎందరికి ఎప్పుడు ఇళ్లు ఇస్తాయో తెలియదు. ఇందిరమ్మ కమిటీలన్నీ గందరగోళంగా ఉన్నాయి. నిరుపేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వాలన్నదే మా డిమాండ్. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను కలిశాం. కానీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు స్థలాలను ఇచ్చి హక్కు పత్రాలను సైతం అందజేసింది. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చాలి. అత్యంత నిరుపేదలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలాలిస్తే వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఎలా? ఇంకా ఎన్నాళ్లు వారు అద్దె ఇండ్లలో కష్టాలు పడుతూ జీవించాలి. వారందరికీ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిందే.