చుంచుపల్లి, మే 14 : చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై వచ్చిన వార్తా కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతుల నుండి తారం బదులుగా నగదు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు, క్వింటాకు ఐదు కేజీల తరుగు తీస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన డీఆర్డీఓ పీడీ విద్యాచందన గురువారం పెనగడపలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. “రైతుల నుండి డబ్బులు ఎవరు తీసుకోమన్నారు?”, “తారం బదులు నగదు ఎందుకు వసూలు చేస్తున్నారు?”, “మిల్లర్లకు ఎందుకు చెల్లించారు?” అంటూ ఐకెపి సిబ్బంది కుమారి, మైమునీసా, ఏపీఎంలను డీఆర్డీఓ నిలదీశారు. మిల్లర్లు ధాన్యం తీసుకోవడంలో ఇబ్బందులు పెడితే ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
ధాన్యం క్వింటాకు ఐదు కేజీల తరుగు తీస్తున్నారన్న విషయంపై కూడా ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం సరికాదని, తరుగు డబ్బులు వసూలు విషయంలో ఫిర్యాదు వస్తే ఐకెపి సిబ్బందిని, ధాన్యం కొనుగోలు నిర్వాహక సిబ్బందిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలు వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా రైతులు తమ సమస్యలను డీఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడం, లారీలు సకాలంలో లోడ్ కాకపోవడం వల్ల ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతోందని తెలిపారు. వర్షాలు, గాలి దుమారాలతో ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన విద్యాచందన అక్కడి నుంచే పౌర సరఫరా శాఖ డీఎంతో ఫోన్లో మాట్లాడి గన్నీ బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలని, రైతుల ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పీఆర్ రకాల ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని, అందులో తరుగు ఎక్కువ వస్తోందని రైతులు వివరించారు. ఈ అంశంపై కలెక్టర్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. “నమస్తే”లో వచ్చిన కథనంతో కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న వ్యవహారాలపై అధికారుల దృష్టి పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.