రామవరం, డిసెంబర్ 06 : అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని, ఆయన జ్ఞానానికి ప్రతీక అని కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్ డా.టి.భరత్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన అంబేద్కర్ సంఘ సంస్కర్తగా దేశానికి, సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ సేవలకు గానూ 1990లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను పొందారన్నారు. సమ సమాజ నిర్మాణంలో బాబా సాహెబ్ ను ప్రపంచ దేశాలు అలాగే ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త డా.హేమ శరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.