– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
- జూలూరుపాడు కేజీబీవీ, జడ్పీ పాఠశాలల ఆకస్మిక తనిఖీ
జూలూరుపాడు, జూన్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారంతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను నిశితంగా పరిశీలించారు. ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న విద్యా సౌకర్యాలు, వసతి, భోజన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ విద్యాసంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినుల ఔటింగ్ రిజిస్టర్ను పరిశీలించిన ఆయన, బాలికల భద్రత విషయంలో రాజీ పడకూడదని, తల్లిదండ్రులు లేదా అధికారికంగా అనుమతించిన సంరక్షకులతో మాత్రమే వారిని బయటకు పంపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్రూమ్లను తనిఖీ చేసిన కలెక్టర్, నిల్వ ఉంచిన సరుకులను, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలోని సీసీ కెమెరాల పనితీరును, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు.

‘పాఠశాలల్లో మౌలిక వసతులు, భోజన నాణ్యతపై రాజీ పడొద్దు’
జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల నమోదు, హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా తనిఖీ చేయగా, పప్పు పలుచగా ఉండటంతో పాటు భోజనంలో నాణ్యత లోపించినట్లు గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతో, ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. నేను మళ్లీ ఆకస్మికంగా తనిఖీ చేస్తాను. ఆహార నాణ్యతలో లోపాలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందాయా లేదా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. తాగునీరు, పరిశుభ్రత, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుతో పాటు, వారి ఆరోగ్యం, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పాఠశాలల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్ది, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరింత విశ్వాసం కలిగేలా విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, పరిశుభ్రతను మెరుగుపర్చాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంఈఓ జుంకీలాల్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.