రామవరం ,మార్చి 22 : రంజాన్ మాసంలో ఉపవాస విరామ సమయంలో చేసే ప్రార్థనలో పాల్గొనేందుకు విధుల నుంచి ఒక గంట ముందుగా వెళ్లేందుకు ముస్లింలకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ 21 జనవరి, 2025 నాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15, 2025 సర్కులర్ ను జారీ చేసింది. ఇందులో ముస్లిం ఉద్యోగులు ఒక గంట ముందు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, బోర్డు కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు ఈ నెల 2 నుండి 31వ తేదీ వరకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కానీ పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి సింగరేణి సంస్థ మాత్రం సీఎస్ సర్కులర్కి విలువ ఇవ్వడం లేదని ముస్లిం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులు గడిచిపోయినవి కనీసం మిగిలిన 10 రోజుల్లో అయినా గంట ముందుగా వెళ్లే అవకాశం కల్పిస్తే తాము ఇఫ్తార్ సమయం, మసీదులో గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు.