మామూలుగా దీపావళి పండుగ అంటేనే దీపాల పండుగ. పటాసుల పండుగ. నోముల పండు. దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసే పండుగ. పట్నాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ. కానీ.. అక్కడ మాత్రం దీపావళి అంటే సమాధుల వద్ద జరుపుకుంటారు. తమ కుటుంబ సభ్యుల్లో చనిపోయిన వాళ్లను స్మరించుకోవడం కోసం దీపావళి పండుగ రోజుల సమాధుల వద్దకు వెళ్లి పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. ఈ భిన్న సంస్కృతి ఉన్నది ఎక్కడో కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.
జిల్లాలోని కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో దీపావళి పండుగ అంటే.. చనిపోయిన వారిని గుర్తుచేసుకోవడం. వాళ్ల గుర్తుగా జరుపుకునే పండుగ. దీపావళి రోజు వాళ్ల కుటుంబ సభ్యుల సమాధులను ముస్తాబు చేసి.. చనిపోయిన వారికి ఇష్టమైన వంట చేసి తీసుకొచ్చి అక్కడ ఆహార పదార్థాలను పెట్టి దీపాలు వెలిగించి.. వాళ్లను స్మరించుకుంటారు. ఆ తర్వాత పటాసులు పేల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఇంటి వద్ద బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేస్తారు.