– రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ముందు ఏఐటీయూసీ నిరసన
రుద్రంపూర్, ఏప్రిల్ 02 : సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ ఇవ్వకుండా వేరే వారికి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సింగరేణి కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వట్టి కొండ మల్లికార్జున్ రుద్రంపూర్ భారత్ గ్యాస్ గోడౌన్ ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
తాను మార్చి 13న గృహ అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నానని, మార్చి 18న డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి ఫోన్ చేసి ఓటీపీ అడిగాడని, తాను ఓటీపీ చెప్పినప్పటికీ సిలిండర్ ఇవ్వకుండా తీసుకెళ్లి వేరే వ్యక్తులకు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ విషయాన్ని గ్యాస్ గోడౌన్ సిబ్బందికి తెలియజేసినట్లు చెప్పారు. అలాగే సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ దేవదాసుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు సిలిండర్ అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక కార్మిక నాయకుడిని ఇలా మోసం చేస్తే, ఇక సాధారణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. క్లిష్ట పరిస్థితిని ఆసరాగా తీసుకుని హోటళ్లకు, వాణిజ్య అవసరాల కోసం సిలిండర్లను మళ్లిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతమైతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సూపర్ బజార్ ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన ఫోను ఎత్తకపోవడం గమనార్హం.