రామవరం, జూన్ 12 : ఎండనక, వాననక వీధి వ్యాపారులు తమ కుటుంబం కోసం పడుతున్న కష్టం వారిని కలచివేసింది. తమ వంతుగా వారికి ఏదైనా సాయంచేయ తలంచారు. అనుకున్నదే తడవుగా స్టాండ్ గొడుగులు కొని అందజేశారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు కుమారుడు ఎం.జోని విన్సెంట్, షకీనా మాథ్యూస్ దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. వారి కుమార్తె ఐరా పేరు మీద వీధి వ్యాపారులకు ఎండ, వాన నుండి కాపాడుకునేందుకు గొడుగులను అందజేశారు. సుమారు రూ.6 వేల విలువైన గొడుగులను కొత్తగూడెం సెంటర్లోని వీధి వ్యాపారులకు గురువారం పంపిణీ చేశారు. వీరి సేవా కార్యక్రమానికి పలువురు అభినందనలు తెలిపారు.