రుద్రంపూర్, జూలై 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో గురువారం 16న భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) 98వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రైతుల కోసం ప్రత్యక్ష ప్రసార ద్వారా వీక్షించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, జీవ ఎరువుల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా.టి.భరత్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంపై ఏర్పడే ప్రతికూల పరిస్థితులను వివరించారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే జీవ ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, పోషకాలు మొక్కలకు సులభంగా అందుబాటులోకి రావడం, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.
రైతు ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు పి.పాపారావు సహజ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పర్యావరణ హిత వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా నేల సారాన్ని పరిరక్షించి, దీర్ఘకాలికంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా కొనసాగించవచ్చని వివరించారు. అనంతరం గిరిజన ఉప ప్రణాళిక ద్వారా 65 మంది రైతులకు ఉచితంగా ప్సూడోమోనాస్ ట్రైకోడెర్మా విరిడే, జీవ ఎరువులు, 5 పోర్టబుల్ వర్మిబెడ్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా స్థిరమైన పంట ఉత్పత్తి, నేల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటు అందించనున్నారు. అదేవిధంగా పప్పుధాన్యాలలో ఆత్మనిర్భర భారత్ మిషన్ పథకం కింద రైతులకు మొక్కజొన్న పంటలో కలుపు నివారణ మందులు, కంది విత్తనం TDRG-59ను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేశారు.