– పీవీకే–5 ఇంక్లైన్ క్రెడిట్ సొసైటీ నిధుల వినియోగంపై మరోసారి ప్రశ్నలు
రుద్రంపూర్, సెప్టెంబర్ 08 : పీవీకే–5 ఇంక్లైన్ క్రెడిట్ సొసైటీ నిధుల వినియోగంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొసైటీ తరగతుల్లో “ఎడ్యుకేషనల్ టూర్” పేరుతో మంచి పనితీరు కనబరుస్తున్న సొసైటీలను సందర్శించి, వాటి నిర్వహణ విధానాలు, పనితీరును అధ్యయనం చేయాల్సి ఉంటుందని సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ ఉద్దేశ్యాన్ని పక్కనపెట్టి, ఇటీవల కొందరు డైరెక్టర్లు ఆ కార్యక్రమాన్ని విహారయాత్రలు, వినోదాలకు వేదికగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎడ్యుకేషనల్ టూర్ ఉద్దేశ్యం ఇతర సొసైటీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి విధానాల్లోని మంచి అంశాలను తమ సొసైటీలో అమలు చేయడం. కానీ సొసైటీ నిధులతో నిర్వహించే పర్యటనలు ఆ లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్నాయా? అనే సందేహాలు సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. సొసైటీ సొమ్మును తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనల పేరుతో ఖర్చు చేయడం ద్వారా సభ్యులకు దక్కుతున్న ప్రయోజనం ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
మరో అంశం కూడా సభ్యుల్లో అనుమానాలకు తావిస్తోంది. సొసైటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొనాల్సిన ఎడ్యుకేషనల్ టూర్లో అధికారులు వెళ్లకుండా కేవలం డైరెక్టర్లు మాత్రమే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పర్యటన ఉద్దేశ్యం నిజంగా ఇతర సొసైటీల పనితీరును అధ్యయనం చేయడమే అయితే, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటేనే ఆ పరిశీలనకు ప్రామాణికత ఉంటుందని వారు అంటున్నారు.
సొసైటీ నిధులతో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి స్పష్టమైన ఉద్దేశ్యం, అనుమతులు, ఖర్చుల వివరాలు ఉండాలని సభ్యులు కోరుతున్నారు. ఎడ్యుకేషనల్ టూర్ పేరుతో ఎంత మొత్తం ఖర్చు చేశారు? ఎవరు పాల్గొన్నారు? ఏ సొసైటీలను సందర్శించారు? అక్కడ ఏ విధానాలను అధ్యయనం చేశారు? వాటి ద్వారా సొసైటీకి ఏం ప్రయోజనం చేకూరింది? అనే వివరాలను సభ్యుల ముందుంచాలని డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ నిధులు సభ్యుల ప్రయోజనాల కోసం వినియోగించాలే తప్ప, వ్యక్తిగత వినోదానికి ఉపయోగించకూడదని సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఎడ్యుకేషనల్ టూర్ నిజంగా విద్యా ప్రయోజనం కోసం జరిగిందా? లేక ఆ పేరుతో విహారయాత్రకు మారిందా? అన్నదానిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అధ్యయనం పేరుతో ఖర్చు.. ఫలితం మాత్రం ఎక్కడ? — ఇదే ఇప్పుడు సొసైటీ సభ్యుల ప్రధాన ప్రశ్నగా మారింది.