రుద్రంపూర్, ఏప్రిల్ 30 : మూడు దశాబ్దాల పాటు వెంకట మోహనరావు వివిధ బాధ్యతల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి సింగరేణి సంస్థకు విశేష సేవలు అందించారని, అలాగే సత్యనారాయణ ఫైనాన్స్ విభాగంలో నిజాయితీ, సమయ పాలనతో పనిచేసి అందరి మన్ననలు పొందారని ఇరువురు అధికారులు తమ సేవల ద్వారా సంస్థలో మంచి విలువలను నెలకొల్పారని వారి అనుభవం, మార్గదర్శకత్వం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం (పర్సనల్)గా విధులు నిర్వహించిన జి.వి.మోహన్‌రావు గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 27-08-1989న సేవలో చేరిన మోహన్‌రావు , తన సుదీర్ఘ సేవా ప్రయాణంలో అనేక ప్రాంతాల్లో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రారంభంలో రామగుండం ప్రాంతంలో వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనీగా సేవలందించి, అనంతరం 2003 నుండి 2007 వరకు కొత్తగూడెం ఏరియాలో విధులు నిర్వహించారు.
తర్వాత కార్పొరేట్ హెడ్ ఆఫీస్‌లో 2020 వరకు వివిధ హోదాల్లో పని చేశారు. 2021 నుండి 2025 వరకు ఇల్లెందు ప్రాంతంలో డీజీఎంగా విశేష సేవలు అందించారు. 2025 జూన్ 16న కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చి, ఇక్కడ తన సేవలను కొనసాగిస్తూ పదవీ విరమణ పొందారు. అదేవిధంగా జీఎం కార్యాలయంలో ఫైనాన్స్ విభాగంలో క్యాషియర్‌గా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విశిష్ట సేవలు అందించిన సిదిరాల సత్యనారాయణ కూడా నేడు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు మాట్లాడుతూ మోహన్‌రావు, సత్యనారాయణ తమ తమ విభాగాల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి సంస్థకు విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి సేవలు సంస్థలో చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు. మోహన్‌రావు సంస్థలో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు కార్మికులు , అధికారుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో విశేష పాత్ర పోషించారని అన్నారు.
అలాగే సత్యనారాయణ జీఎం కార్యాలయ నిర్వహణలో తన అనుభవంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం షాలెం రాజు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ముక్కపాటి వెంకటేశ్వర్లు, సిఎంఎంవోఏఐ అధ్యక్షులు నరసింహరావు, ఏరియా ఇంజనీర్ కె.సూర్యనారాయణ రాజు, జీఎం ఐఆర్‌పీఎం, ఏజీఎం (పర్సనల్) రాజేంద్ర ప్రసాద్, అంతోటి నాగేశ్వరరావు, ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సౌజన్య, ఐఎన్టీయూసీ పిట్ సెక్రటరీ సాగర్ తదితర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.