చుంచుపల్లి, మే 06 : చుంచుపల్లి మండలంలోని పెనగడప పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రోడ్లపైనే కొనుగోలు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం చేసినా ఇంతవరకు కొనుగోలు జరపలేదు. పెనగడప పంచాయతీలో గతంలో సిసి ఏర్పాటు చేసి కొనుగోలు చేపట్టేవారు. సీసీ ఏర్పాటు చేసేందుకు స్థలం దొరకక పోవడంతో పెనగడప పీహెచ్సీ రోడ్డు పైన అదేవిధంగా ములుగుడం రోడ్డుపైన రైతులు వడ్లను ఆరపెట్టి కుప్పలు పోసి కొనుగోళ్లకు సిద్ధం చేశారు. కానీ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, సీసీ (కలెక్షన్ సెంటర్లు / కొనుగోలు కేంద్రాలు) ఏర్పాటు చేయకపోవడం సమస్య మరింత తీవ్రమైంది.
సాధారణంగా రైతులు పండించిన ధాన్యాన్ని సీసీ కేంద్రాలకు తీసుకువెళ్లి అమ్మాల్సి ఉంటుంది. అయితే ఈసారి కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో అధికారులు రోడ్లపైనే కొనుగోలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ధాన్యం నిల్వ చేయడం వల్ల వర్షం, గాలి ప్రభావంతో పంట నాణ్యత దెబ్బతింటోంది. అదనంగా రవాణా సౌకర్యాల లోపం, తూకం వేయడంలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, న్యాయమైన ధరతో పాటు సమయానికి చెల్లింపులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.